మరణ భయంతో మానవ సంబంధాలు
ఎన్నో ఆశలు, అనుబంధాలూ పెంచుకుని, సుఖ సంతోషాలతో ఉండే అనేక మధ్యతరగతి కుటుంబాలు, కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుని అగాథాల లోతుల జారుతున్న విజేతలు, మనిషిని మనిషి చూస్తేనే భయపడి అనుమానంగా చూసే రోజులు.
కరోనా మార్చేసింది సామాజిక చిత్రపటాన్ని. కరోనా శాసిస్తోంది ఓ మనిషీ మనిషిగా బ్రతకమని. కరోనా బోధిస్తోంది భూమికి మనిషి కేవలం ఒక అతిథి మాత్రమేనని.
ఆడంబరాలకు, వైభవ ప్రదర్శనకూ, విలాసాలకూ చెక్ పెడుతూ... తస్మాత్ జాగ్రత్త బయటకు వెళ్తే బలౌతావ్, బయటవారిని నీ ఇంటికి పిలిచినా బలౌతావ్! బ్రతకాలంటే బంధాలు వేసుకో అని హెచ్చరిస్తోంది కరోనా! హెచ్చరికలు పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
మహా నాయకుడైనా, మహా భక్తుడైనా, ధర్మాత్ముడైనా, మహాత్ముడైనా, ధనవంతుడైనా, నిరుపేద అయినా, మతం ఏదైనా, కులం ఏదైనా కరోనాకి ఒక్కటే మనిషిని వదిలేది లేదంటూ సవాల్ విసిరింది.
రానంత వరకూ రాజాలా తిరిగే జనం, కరోనా సోకగానే కలతపడుతున్నారు. రోజుకి రెండు లక్షలు గుంజుతూ చచ్చాక బిల్లు కట్టించుకుని తగలెట్టే కార్పొరేట్ హాస్పిటల్స్ వికృత రూపం వికటం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులంటే రోగులు భయపడిపోతూ ప్రైవేటు కి పరుగుతీసి ఛిద్రమైపోతున్నారు.
బాధపడి నిట్టూర్చడం తప్ప దగ్గరకు వెళ్ళి చేయూత నివ్వలేని దుస్థితిలో... ఓదార్చలేని అసహాయతలో మనిషికి మనిషి ఏమీ కాని ఒంటరి పయనం చేస్తుంటే... ఇలా ఇంకా ఎన్నాళ్ళు అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటే... మానవ సంబంధాలన్నీ మరణ భయంతో ఫట ఫట మని తెగిపోతుంటే... అదిగో వస్తోంది వాక్సిన్ అనే ఆశాకిరణం ఎడారి ఎండమావిలా గోచరిస్తుంటే...
చేసేదిలేక చేతులెత్తేసినా... ప్రపంచంలో మేమే బెస్ట్ అని కాలర్ ఎగరేసే ప్రభుత్వాలని చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియని జనం బలి పీఠం వైపు తలవంచుకు పోతున్నారు.
ఓ దైవమా! నీవంటూ అసలు ఉంటే... నీ ఉనికే నిజమైతే... మా తప్పులు క్షమించు! ఈ ప్రళయాన్ని సరిదిద్దు. ఆరోగ్యవంతంగా ఈ ప్రపంచాన్ని పునర్నిర్మించు 🙏

Comments
Post a Comment