ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1



డిమ్ లైట్ కాంతి లో ఆ రూమ్ అస్పష్టంగా  ఉంది.  చాలా అస్పష్టంగా...   కానీ అది రాత్రి కాదు. అప్పటికి సమయం ఉదయం పది గంటలయింది .  కానీ ఆ రూమ్ మాత్రం కాంతి లోపలికి చొరబడనంత చీకటి గా ఉంది. సీలింగ్ కి అమర్చిన ఫ్యాన్సీ నైట్ బల్బు సన్నటి వెలుగు ఆ రూమ్ మధ్యలో ఉన్న మంచం , కనీ కానీ కనిపించని ఫర్నీచర్...  చాలా నిశ్శబ్దం గా ఉంది. కానీ ఆ రూమ్ బయట సిటీ బిజీ గా ఉంది. 

నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సెల్ ఫోన్ మ్రోగింది. ఒకసారి కాదు... అలా మ్రోగుతూనే ఉంది.  కానీ ఆ మంచం మీద కదలికలు లేవు.

సమయం మధ్యాహ్నం పన్నెండు దాటింది. కొంత సేపటికి పెద్ద శబ్దాలు... తలుపులని ఎవరో  బ్రద్దలు కొడుతున్నారు.  గట్టిగా అరిచి పిలుస్తున్నారు. లోపల మాత్రం ఎటువంటి కదలికా లేదు. భళ్ళున తలుపులు తెరుచుకొని లోపలి కొంతమంది వచ్చారు. 

ఎవరో లైట్ వేశారు. లైట్ వెలుగులో రూమ్ చిందరవందరగా కనిపించింది. మంచం మీద బేంకులెట్సు అస్తవ్యస్తంగా ఉన్నాయి . కానీ ఎవ్వరూ లేరు. బాత్రూమ్ తలుపు దగ్గరగా వేసి ఉంది. అందులో లైట్ వెలుగుతూ ఉంది. వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి కొంచెం అనుమానంగా చూసాడు. బాత్రూమ్ వైపు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. తలుపు కొంచెం ముందుకు త్రోసి లోపలి చూసి "సార్!" అని గట్టిగా అరిచాడు. 

బాత్రూములో శవం ఉంది సార్! మరోసారి గట్టిగా అరిచాడు. క. క... కానీ...  అది మేడంది కాదు!

వ్వాట్! మేడంది కాదా! మరి ఎవరిది? మరి మేడం ఏమయింది? అరిచాడు పొడుగ్గా ఉన్న మరో వ్యక్తి. రూమంతా వెతికారు. ఏమయినా క్లూ దొరుకుతుందేమోనని. ఏమీ దొరకలేదు.

********************

గిరీ...! స్టేషన్ చూస్తూ ఉండు నాకోసం ఎవరొచ్చినా ఫోన్ చెయ్యి. రాజూ పద! మరో శవం! ఈ సారి బాత్రూమ్ లో... విజయ్ ఇన్ఫామ్ చేసాడు. భరత్ నగర్ రెండవ వీధికి పోవాలి. కార్లో కూర్చుంటూ అన్నాడు ఇన్స్పెక్టర్ వర్మ.

కారు వేగంగా భరత్ నగర్ వైపు వెళ్తోంది... వర్మ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. పదిహేను రోజుల్లో ఎనిమిదవ హత్య... చనిపోయిన వారి వివరాలు లేవు. ఎందుకు చంపబడ్డారో ఎవరు చంపారో ఏమాత్రం క్లూస్ దొరకడం లేదు. పై ఆఫీసర్ల నుండి ఒకటే ఒత్తిడి. అసలు ఒక హత్యకీ మరో హత్యకీ పొంతన లేదు. ఇది సీరియల్ కిల్లర్ చేస్తున్న పనిలా అనిపించడం లేదు. సీరియల్ కిల్లర్ పనైతే ఎక్కడో ఈ హత్యలకి కామన్ పోయింట్ ఉండి ఉండాలి. అదేమిటో తెలిస్తే కేస్ ముందుకు కదులుతుంది.

రాజూ నీకెవరిమీదైనా అనుమానం ఉందా? అసలు మనం ఈ కేసులనన్నిటీనీ రైట్ ట్రాక్ లో ఎనలైజ్ చేస్తున్నామా? ఒక కేసు స్టడీ చేసేలోపు మరో హత్యకేసు ఎదురౌతోంది. నొసలు చిట్లించుకుంటూ అన్నాడు వర్మ.

అవును సార్... ఇది ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్ పనిలా కనిపిస్తోంది.‌‌ ఏ క్లూ వదలకుండా చేసుకుపోతున్నాడు. అన్నాడు రాజు.

భరత్ నగర్ రోడ్ మలుపు తిరిగి ముందరకు వెళ్తోంది కారు.  వీధి చివర జనం గుమికూడి కనిపిస్తున్నారు. కారు ఒకప్రక్కకి ఆపి క్రిందికి దిగాడు వర్మ. రాజు కూడా అతనిని ఫాలో అయ్యాడు.

వీళ్ళని చూడగానే జనం భయంగా ప్రక్కకి జరిగారు. అక్కడ కొందరు విలేఖర్లు న్యూస్ కవర్ చేస్తున్నారు.

వర్మ గబగబా ఆ ఇంట్లోకి వెళ్ళాడు. రూమ్ లో మేడమ్ లేదండీ...కానీ ఇంకెవరిదో శవం ఉంది. చెప్పాడు పొడుగ్గా ఉన్న వ్యక్తి.

మీ పేరు? అడిగాడు వర్మ

నా పేరు ధనుంజయ్ అమ్మగారి మేనేజర్ ని. 

అమ్మగారు ఎవరు? అడిగాడు వర్మ కొంచెం చిరాకుపడుతూ.

సాహితీ పబ్లికేషన్స్ ఎండీ. చెప్పాడు ధనంజయ్.

మేడమ్ ఇంట్లో లేరా? క్యాజువల్ గా అడిగాడు వర్మ ‌.

ఇంట్లోనే ఉండాలి సార్. కానీ లేరు. లోపల ఉన్నవారు ఉన్నట్టే ఎలా మాయమయ్యారో... ఇంట్లో శవం ఎవరిదో అర్థం కావడం లేదు సార్. ఆమెను ఇదివరకెప్పుడూ చూడలేదు.

ఇంట్లో ఉండవలసిన మేడమ్ ఉండకుండా ఎవరిదో శవం ఉండటమేమిటి? ఆర్ యు ష్యూర్? అడిగాడు వర్మ.

యస్ సార్. రాత్రి మేడమ్ బెడ్రూమ్ లోకి తలుపులు వేసుకుని వెళ్ళారు. నన్ను ఇంట్లోనే హాల్లో పడుక్కోమన్నారు. ప్రొద్దుటే ఏదో ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలని. తడుముకోకుండా చెప్పాడు ధనంజయ్.

సరే... లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫోరెన్సిక్ నుండి కనకారావ్ గారు వచ్చారా? 

ఇంకా రాలేదండి. పది నిమిషాల్లో వస్తున్నారని మెసేజ్ వచ్చింది
.

ఓకే లెటజ్ గో! అంటూ ఆ రూమ్ లోకి వెళ్ళి గదిని పరిశీలించాడు.

గది చిందరవందరగా ఉంది. బహుశా ఆ సంఘటనకు ముందు ఏదో పెనుగులాట జరిగి ఉండాలి. 

బయట ఏదో అలికిడయ్యింది. క్లూస్ టీమ్ వచ్చినట్లుంది.

ధనుంజయ్ ! సరిగ్గా చెప్పు! ప్రొద్దుట నుండి ఒక్క కాల్ కూడా మీ మేడమ్ నుండి రాలేదా? అడిగాడు వర్మ.

రాలేదండి. వేసుకున్న తలుపులు వేసుకున్నట్లే ఉన్నాయి. ఆవిడ బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఒకవేళ వెళ్ళినా కారుకోసం డ్రైవర్ని లేపుతుంది. ఆవిడ కారు డ్రైవ్ చేయడం నేను ఇప్పటివరకూ చూడలేదు. మరో విషయం ఏంటంటే ఆవిడ సెల్ఫోన్ బెడ్ రూమ్ లోనే వుంది. అన్నాడు మేనేజర్.

వర్మ ఆలోచనలో పడ్డాడు.

హలో!.... కనకరావ్ వస్తూనే పలకరించాడు. హాయ్ అంటూ విష్ చేసాడు వర్మ. ఈ పదిహేను రోజుల్లో ఇది ఐదవది.  కనుబొమ్మలు, భుజాలు ఎగరేస్తూ అన్నాడు కనకారావ్.

వర్మ కూడా పెదవి విరిచాడు. 

ఓకే! మేం క్లూస్ కలెక్ట్ చేస్తాం. మీరంతా బయట వెయిట్ చేయండి అన్నాడు కనకారావు.

ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న అంశాన్నీ నిశితంగా పరీక్షిస్తుంది. శరీరం పై గాయాల్ని, శరీరం ఉన్న పోస్ట్చర్ ని, తలవెంట్రుక నుండి కాలి గోళ్ళు వరకూ దేనినీ వదిలిపెట్టరు. ఇంట్లో కూడా అంగుళం అంగుళం గాలిస్తుంది. అనుమానం కలిగినా ప్రతీ వస్తువు నీ సేకరిస్తుంది. ఫొటోలు తీస్తుంది. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కనకారావ్ టీమ్ అదే పనిలో నిమగ్నమయింది.

మనం కాసేపు బయట ఉందాం. వీళ్ళ పనికి అడ్డురాకూడదు. మిస్టర్ ధనుంజయ్ ఇంటి సిసి ఫుటేజ్ పరిశీలించాలి. డివైసెస్ ఎక్కడ అమర్చారు? అడిగాడు వర్మ.

పదండి చూపిస్తాను... తీసుకువెళ్ళాడు ధనుంజయ్.

వర్మ సిసి ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. రాత్రి 9:30 నిమిషాలకి కార్ పోర్టికోలోకి వచ్చి ఆగింది. మేడమ్ మాళవిక కారులోంచి దిగారు. ఆ తర్వాత మార్నింగ్ పది వరకూ ఎవ్వరూ బయటికి పోలేదు. హాల్ లో కూడా ఎటువంటి అలికిడీ లేదు.

వర్మ బయటికి వచ్చాడు. సిగరెట్ వెలిగించుకుంటూ ఇంటి వెనుక వైపు పరిశీలిస్తూ అడిగాడు. ఇంటి బేక్సైడ్ ఫుటేజ్ మనం చూడలేదు. కెమేరా ఫిక్స్ చెయ్యలేదా అడిగాడు. 

చేసే ఉంది సార్. కానీ ఈ మధ్యే పాడయింది. చెప్పాడు ధనంజయ్. ఒకవేళ వెనుక వైపు నుండీ ఎవరైనా లోపలికి వచ్చి ఇంట్లోకి ప్రవేశించారేమో... 

వెనుక వాటర్ పైపులు, గోడలూ కిటికీలు అన్నీ చెక్ చేస్తూ ఆగిపోయాడు. అక్కడ మట్టిలో బూట్ల అచ్చులు కనిపిస్తున్నాయి. కనీసం ఐదుగురు వ్యక్తులు వచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కానీ కిటికీలు తెరిచి లేవు, అద్దాలు పగిలి లేవు! ఒకవేళ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించి ఉంటే దేనినైనా బ్రేక్ చేయాలి. కానీ ఏవీ బ్రేక్ కాలేదు. కాంపౌండ్ వెనుక మట్టిలో ఉన్న బూట్ల అచ్చులు ఇంటి ఆవరణలో లేవు. అంటే ఇంట్లోకి ఎవ్వరూ రాలేదు.

ఇంట్లోని వ్యక్తులు బయటికి వెళ్ళకుండా... బయటి వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా... మేడమ్ ఏమైనట్లు! లోపల ఇంకెవరిదో శవం ఉండటమేమిటి! షిట్!  మేనేజర్ ఏదో దాస్తున్నాడు. అనుకున్నాడు వర్మ.

ఆ బూట్ల జాడలు ఎటు వెళ్ళాయో పరిశీలించాడు. అవి ఆ ఇంటికి దూరంగా వీధి రోడ్డుని క్రాస్ గా కలుపుతూ ఉన్నాయి. అంటే... ఎవరో ఒక వేన్ తో వచ్చి ఇంటి ముందర వరకూ రాకుండా అక్కడే ఆపి ఉండాలి. 

ఒకసారి వీధిలోని, చుట్టు ప్రక్కల ఎవరింటివైనా సిసి కెమేరాలు కేచ్ చేశాయేమో చూడాలి. అనుకున్నాడు వర్మ. 

రాజూ... పద ఈ రోడ్లో అమర్చిన సిసి టివి ఫుటేజ్ చూద్దాం అంటూ రాజుని పిలిచాడు వర్మ.  

రోడ్ చాల పొడవుగా ఉంది.  ఇన్సిడెన్సు  జరిగిన మాళవిక మేడం ఇల్లు ఐసోలేటెడ్ గా ఉంది. 

రాజూ ఈ సిసిటివి లు ఎక్కడ నుండి మానిటర్ చేస్తారు? ఇక్కడకి దగ్గర్లో కాలనీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంది సార్. అక్కడే చూస్తుంటాం. ఓకే పద ముందు ఇక్కడ ఎవరింటి నుండైనా సీసీ ఫుటేజ్ దొరుకుతుందేమో  అంటూ నాలుగు వైపులా చూస్తూ గడ్డం నిమురుకున్నాడు వర్మ.  

ఆ ప్రాంతంలో ఇళ్లన్నీ విసిరేసినట్లు ఉన్నాయి. కొంచెం దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళాడు వర్మ. 

వర్మని చూడగానే ఆ యింటి యజమాని గబగబా బైటికి వచ్చాడు. మీ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయా? అడిగాడు వర్మ. 

లేదు సార్.  మేము ఈ మధ్యనే దిగాం ఇంకా అమర్చుకోలేదు. అన్నాడు ఆ యింటి యజమాని.  

హు మ్ మ్ ... అంటూ మళ్ళీ రోడ్డువైపు తిరిగాడు. 

సార్ ఆ రోడ్ మీది కెమెరాలు పని చేయవు సార్. ఎందుకంటె ఈ మధ్యే ఇక్కడ రోడ్ రిపేర్  అయింది. అన్నీ తవ్వేసి  కట్ చేశారు.  చెప్పాడు ఆ యింటి యజమాని. 

ఓహ్ షిట్!! ఇప్పుడు ఎలా!! వర్మ బాగా డిస్సపాయింట్ అయ్యాడు. 

సార్ !! మీకు పనికొస్తుందంటే ... నేను ఒక విషయం చెప్తాను. అంటూ ఇన్స్పెక్టర్ వర్మ కళ్ళలోకి చూసి నెమ్మదిగా రహస్యం చెపుతున్నట్లు చెప్పాడు ఆ ఇంటి యజమాని. 

ష్యూర్!! తప్పకుండా చెప్పండి. యెగజైటింగ్ గా అడిగాడు వర్మ. 

ఇక్కడ కాదు. ఇంట్లోకి రండి సార్.  అంటూ గేట్ తీసాడు. వర్మ, రాజు  అతన్ని ఫాలో అయ్యారు. 

కూర్చోండి సార్. కుర్చీలు చూపించి తానూ ఒక కుర్చీ లాక్కున్నాడు హౌస్ ఓనర్ . 

అతను చెప్తుంటే ... వర్మ ముఖంలో ఉత్ఖంట హై  రేంజ్ లో పెరిగింది. 

( పార్ట్ - 2 త్వరలో )

 ఈ కథలోని పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు, ఎందునుండీ సేకరించినవి కావు. 

Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!