నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ



అనంతా చార్య  బిఎ తో చదువు ఆపేశాడు. ఒక చిన్న బట్టల దుకాణంలో సేల్సు మేన్ ఉద్యోగం చేస్తున్నాడు. జీతం నెలకు ఐదువేల రూపాయలు.

ఆ జీతంతో ఫామిలీని పోషించడం చాలా కష్టంగా ఉంది అతనికి. కానీ అంతకన్నాపెద్ద ఉద్యోగం  వచ్చేలా లేదు. చాలా ట్రై చేసి ఇక లాభం లేదని వదిలేసి ఇలా సెటిల్ ఐపోయాడు.

ఇరవయ్యేళ్ళ ఉద్యోగం లో అతను వెనకేసుకున్నది ఏమీ లేదు. అప్పులు తప్ప.  ఇప్పుడు కొడుకు ని ఫీస్ రీఎంబర్సుమెంట్ ని ఉపయోగించుకుని ఓ ప్రయివేటు కాలేజీలో బిటెక్ చదివించాలని అనుకున్నాడు. కానీ ఓసీ కాండిడేట్ కావడం వలన అతనికి సీటు సంపాదించుకో లేకపోయాడు. ఆస్తులు అమ్ముకుని చదివించే అవకాశమే లేదు. 

అతని చేతకాని తనాన్ని అతనే తిట్టుకోవడం ఒక ఎత్తైతే ...  భార్య విమర్శలు, కొడుకు నిర్లిప్తత అతనిని మరింత బాధకు గురిచేశాయి.

కూతురు టెన్త్ సెకండ్ క్లాస్ లో పాసై ఇంటర్ లో ప్రయివేట్ కాలేజీలో చదివించమని  ఒత్తిడి చేస్తోంది. అటు కొడుకుని బిటెక్  చదివించ లేక, ఇటు కూతురిని ఇంటర్ ప్రయివేట్ కాలేజీ లో అడ్మిషన్ సంపాదించ లేక, పాత అప్పులు తీర్చ లేక ఇంట్లో భార్య నస  భరించలేక, అప్పుల వాళ్ళ దాడులు తట్టుకోలేక  ఇల్లు విడిపెట్టి దూరంగా వచ్చేసాడు. 

గడ్డం పెరిగిపోయింది, బట్టలు మాసిపోయాయి , ఆకలి తో కడుపు ఆర్చుకు పోతోంది.   ఇప్పుడు ఎటు వెళ్ళాలి? చెట్టు క్రింద నీడలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. దుఃఖం పొంగుకొస్తోంది. బంధులవులు, స్నేహితులు కళ్ళ ముందు కదులుతున్నారు... ఎవ్వరి సహాయం కోరలేదు. కోరినా వారు తీర్చరు అనే నిర్ణయానికి వచ్చేసాడు. పెదవులు ఎండి పోతున్నాయి. దాహం, ఆకలి కలిపి ప్రేగులను చుట్టేస్తున్నాయి. 

ఒక్కసారి గతం లోకి వెళ్ళాడు. చిన్నతనం కళ్ళముందు కదిలింది. ఎంత సంతోషంగా గడిచాయి ఆ రోజులు! 

అనంతాచార్య తండ్రి ఒక స్కూల్ టీచర్. ఎంతో మందికి చదువు చెప్పేవాడు. కానీ తనకి మాత్రం చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. చదివిన తర్వాత ఏమి చేయాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. వీధి పిల్లలతో ఆటలు, సినిమాలు, తిరుగుళ్ళు ... అలా గడిపేసే వాడు. 

టెన్తు క్లాసు డింకీలు కొట్టి కొట్టీ ఎలాగో పాసయ్యాడు. తండ్రి లెక్కలు మాస్టర్ కావటం వలన కొంతవరకు కూడికలు, తీసివేతలు గుణాకర భాగాహారాలు అంటే డివిజన్ అండ్ ములిటీప్లికేషన్సు వంటపట్టాయి. ఒక సంవత్సరం ప్రీ యూనివర్సిటీ కోర్సు పాసై డిగ్రీ లో  జాయిన్ అయ్యాడు. దేనిమీదా శ్రద్ధ ఉండేది కాదు. ఎటువంటి లక్ష్యాలూ లేకుండా పెరిగాడు. క్రమం గా ఎదుగుతున్న కొద్దీ స్నేహితులు దూరం అయిపోయారు. ఒంటరితనం ఎదురైంది. 

తండ్రి అప్పటికే రిటైర్ అయిపోవడం వలన ఇంకా తండ్రి మీద ఆధారపడటం మంచిది కాదని చిన్నా చితకా పనులు చేసుకునేవాడు. 

అదృష్టవశాత్తూ  అతనికి దురలవాట్లు ఏవీ లేవు. తల్లి చనిపోయింది. ఒక్కడే కొడుకు. ఇంట్లో ఆడ దిక్కు లేదు. 

ఓ రోజు తండ్రి అనంతాచార్యను పిలిచి, ఈ రోజు ఆదివారం ఇంటికి ఎవరో వస్తున్నారు. ఎటూ వెళ్ళకు అని చెప్పాడు. సరే అని ఇంట్లోనే కాలక్షేపం చేసాడు. తండ్రి బయటకి వెళ్లి స్వీట్ పేకెట్లతో తిరిగి వచ్చాడు. 

"ఇప్పుడు అవన్నీ ఎందుకు?" అడిగాడు అనంత. చెప్తాను. నువ్వు వెళ్లి కాస్త ముఖం కడుక్కుని పాంటూ షర్టూ వేసుకుని తయారవు. మనం బయటకి వెళ్లే పని వుంది. అన్నాడు తండ్రి.  చదువంటే అబ్బలేదు గానీ... తండ్రి అంటే చాలా భయ భక్తులు వున్నాయి అనంతకి. 

నేను రెడీ  అని అన్నాడు ఫ్రెష్ గా టిప్ టాప్ గా తయారై.  తండ్రి అతని వైపు ఎగ దిగా చూసి... హుమ్ ... వాళ్లని రానీ ... అన్నాడు. 

అనంతకు సస్పెన్సు గా ఉంది. ఎవరు వస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? అడగాలనుకున్నాడు. కానీ నోటిదాకా వచ్చి ఆగిపోయాడు. 

ఇంతలో యాభై ఏళ్ళు పై బడిన ఇద్దరు దంపతులు లోపలికి వచ్చారు.  నమస్కారం కృష్ణమాచార్య గారూ  అంటూ తన తండ్రిని పలకరించారు. 

ఆ ఆ .. రండి రండి మీ కోసమే వెయిటింగు గోపాలం గారూ ... ఇదిగో వీడే మా అబ్బాయి! పేరు అనంతాచార్య. అంటూ పరిచయం చేసాడు. 

నమస్కారమండీ అంటూ విష్ చేసాడు అనంత. 

ధీర్గాయుషుమాన్  భావ! నేను మీ తండ్రి గారిని బాగా ఎరుగుదును. వారు మిత భాషి, గొప్ప సంస్కారి కూడాను. మీ గురించి మీ నాన్నగారు చెప్పగా విన్నాను బాబు.  నా పేరు గోపాలం. నేనూ  మీ నాన్న గారూ బాల్య స్నేహితులం. రిటైర్ అయ్యాక ఈ మధ్యే ఈ ఊరు వచ్చి ఇల్లు కొనుక్కుని సెటిల్  అయ్యాను. ఇంకా ఏదో చెప్పబోతుంటే...  

కాస్త రిలాక్సు అవ్వు గోపాలం అంతా అప్పుడే ఎందుకూ ... టీ నా కాఫీ నా? అడిగాడు తండ్రి కృష్ణమాచార్య. 

ఆ ఇప్పుడా ఫార్మాలిటీలన్నీ ఎందుకు కృష్ణ గారూ స్ట్రయిట్ గా పాయింటు కి వచ్చేస్తా... బాబూ నాకు ఒక్క గా నొక్క కుమార్తె. ఇంటర్ పాసయ్యింది ... ఇక పై చదువులు చదివించలేక పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాం. మా అమ్మాయికి వంటా వార్పూ  అన్నీ వచ్చు. నీకు అభ్యంతరం లేక పొతే మా అమ్మాయిని ఒక్కసారి చూసి వెళ్ళు నచ్చితే పైమాటలు పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటాం.  అన్నారు గోపాలం గారు. 

ఎప్పుడో ఎందుకు? ఈ రోజే వస్తాం! మళ్ళీ ఆదివారం వరకూ మా వాడికి కుదరక పోవచ్చు.  అన్నాడు తండ్రి. 

సరే మేం వెళ్లొస్తాం మీరు సాయంత్రం ఆరు గంటలకి వచ్చేయండి. అంటూ హడావిడిగా వెళ్లిపోయారు వాళ్ళు. 

అప్పుడే పెళ్ళేంటి నాన్నా! ఇంకా నేను సెటిల్ కాలేదుగా. మనకి మరింత భారం కాదూ  అని అడిగాడు అనంత ధైర్యం చేసి. 

నువ్వు ఉద్యోగంలో సెటిల్ అయ్యేవరకూ నేను బ్రతికి ఉంటానో లేదో కనీసం జీవితంలో సెటిల్ అయితే చూడాలి కదరా... పైగా మన ఇంటికి ఆడ దిక్కు లేదు. నీకు పెళ్లి చేస్తే ఇల్లు లక్షీ ప్రదంగా ఉంటుంది. అన్నారు తండ్రి. 

తండ్రి మాటని కాదనలేక మౌనంగా ఉండిపోయాడు. గోపాలానికి ఎవరో బట్టల షాపు యజమాని తెలుసుట. నీకు అందులో ఉద్యోగం వేయించు కుంటానని అంటున్నాడు. 300 రూపాయల జీతం, పండగకి బోనస్ ఉంటుందిట. పైగా వాళ్లకి స్వంత ఇల్లు కూడా ఉంది....  ఇంకా ఏదో చెప్పబోయాడు తండ్రి. 

నీ ఇష్టం నాన్నా... అన్నాడు. ఆ తర్వాత అన్నీ స్పీడ్ గా జరిగిపోయాయి.  

ఆ బట్టల షాపులోనే జీవితం గడిచిపోయింది. తండ్రి మరణించిన తరువాత ఫించన్ ఆగిపోయింది.  ఇక తనకి వేరే ఆదాయం లేదు. జీతం అప్పులు తప్ప కూడబెట్టి దాచుకున్నది ఏమీ లేకపోయింది. బాల్యం నాటి ఉల్లాసం పోయింది. ఆ స్మృతులు కూడా క్రమంగా చెరిగి పోయాయి. 

ఇప్పుడు చెట్టు నీడలో కూర్చున్నాడు. ఇంట్లో అందరినీ తలచుకున్నాడు. బరువంతా భార్యకు వదిలేసాడు. వూరు విడిచి దూరంగా వచ్చేసాడు. ఆకలి, నీరసం, దప్పిక తో ఓకే చెట్టు క్రింద కూలబడ్డాడు. భారం గా నిట్టురుస్తూ ...  నన్ను క్షమించండి అని మనసులో అనుకున్నాడు. 

తన లైఫ్ ని ముగించడం తప్ప ఈ వ్యధకు ముగింపు లేదనుకున్నాడు. 

ఎదురుగా ఏవో కార్లు వేగం గా వస్తున్నాయి. వాటికింద పడితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనుకున్నాడు.  కళ్ళు మూసుకుని ముందుకు దూకేసాడు. 

అతని దురదృష్టమో అదృష్టమో తెలియదు గానీ ... వస్తున్న ఆ కార్ల కాన్వాయ్ షడన్ గా ఆగిపోయింది. కారు లోంచి సెక్యూరిటీ గార్డులు దిగి అతడిని బర బరా లాగి అనంతను కొట్టబోయారు. 

ఇంతలో ఆ కారులోనుండీ ఖద్దరు వస్త్రాలలో ఒక వ్యక్తి క్రిందకి దిగాడు.  గబగబా వచ్చి వాళ్ళని కొట్టవద్దని అడ్డు వచ్చాడు. 

అనంతకు బాగా దగ్గరగా వచ్చాడు. ఎందుకు ఇలా చేసావ్ అని అడిగాడు. 

మరో మార్గం లేక! బాధగా జవాబిచ్చాడు అనంత. 

నాతో రా... అంటూ అనంతని కారు ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు అతడు.  కారులో వెల్తున్నంత సేపూ  అనంత వైపే చూస్తున్నాడు అతడు. 

ఇంటికి తీసుకు వెళ్ళాడు. బార్బర్ ని ఇంటికి పిలిపించి షేవ్ చేయించాడు. ఫ్రెషప్ కమ్మన్నాడు. అనంత ఫ్రెష్ ఐ వచ్చాడు. అతనికి అర్థం కాలేదు. ఈ మంత్రి ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని. అతను బయట ఎవరితోనో ఆఫీసర్లతో మాట్లాడి పంపించాడు. 

అనంత అతని దగ్గరికి వచ్చాడు. క్షమించండి మీకు నా వలన ఇబ్బంది జరిగింది. నాకు సెలవు ఇప్పించండి వెళ్ళిపోతాను. అన్నాడు. 

ఉండు నీతో పని ఉంది.  అన్నాడు మంత్రి.  సాయంత్రం అయిపోతోంది. ఆ మంత్రి ఎందుకు ఉండమన్నాడో తెలియదు. కొంత సేపటికి ఒక వ్యక్తి హడావిడిగా వచ్చాడు. అతడు వస్తూనే అనంత దగ్గరకి వచ్చి అనంతా అంటూ వాటేసుకున్నాడు. 

అనంత అతడిని గుర్తుపట్టాడు. చిన్నారెడ్డి! అతడిని చిన్నపుడు అనాథగా చూసాడు. తనే తన ఇంటికి తీసుకు వచ్చి ఇంట్లో పని ఇప్పించాడు. ఎంతో  శ్రద్ధగా పని చేస్తూ నాన్నగారి దగ్గర చదువుకునే వాడు. ఎప్పుడూ మంచి మార్కులతో పాసయ్యేవాడు. అనంత అతడికి పుస్తకాలూ, బట్టలూ కొని ఇచ్చేవాడు. నాన్నగారు రిటైర్ అయ్యాక భారం కాకూడదు అని వెళ్ళిపోయాడు. 

మళ్ళీ ఇదే చూడటం. ఎలా వున్నావ్? అని అడిగాడు అనంత. 

మీ ఇంటి నుండి వెళ్ళాక నేను మా ఊరు వెళ్లి  చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ బాగానే సంపాదించాను. అంతా  మీరు ఇచ్చిన ప్రోత్సాహమే. మీ నాన్న గారి చదువు వాత్సల్యం నన్ను తీర్చి దిద్దాయి. కాలం కలసి వచ్చింది. నా చదువు, తెలివితేటలూ, మంచితనం  మా ఊరి ఎమ్మెల్యే గారి కూతురిని ఆకట్టుకున్నాయి. ఆయన కూడా నన్ను గుర్తించారు. వారి అనుమతి తో వివాహం ఆడాను. ఆయనకు కుడి భుజంగా ఉంటూ అతని వ్యవహారాలన్నీ చూసుకునే వాడిని. 

నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చిన మంత్రి కిషన్ రెడ్డి గారికి నీ ఫోటో ఇచ్చాను. ఇతను నా భార్యకు బాగా దగ్గర బంధువు.  నేను నీ కోసం వెతికాను. కానీ నీకు పెళ్ళై ఎక్కడికో వెళ్లిపోయావని చెప్పారు. నిన్ను ఎలాగైనా కలవాలని ప్రయత్నించి ఇతనికి నీ గురించి చెప్పాను. నువ్వు ఈ స్థితిలో ఉంటావని ఊహించ లేక పోయాను. 

నేను నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలు తీసుకుని మా వూరు వెళ్ళాను. చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు చేసేవాడిని. అవి కూడా కలసి వచ్చేవి. కొంచెం స్థిరపడ్డాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక స్కూల్ పెడదాం అనుకున్నాను. దానికి మా ఊరి ఎమ్యెల్యే గారి సహకారం తీసుకుని ప్రారంభోత్సవం చేయించాను. అది అద్భుతంగా కలసి వచ్చింది. ఎంతో మంది మా స్కూల్ లో చదువుకునేవారు. 

క్రమంగా మా ఎమ్యెల్యే గారికి దగ్గరయ్యాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాడిని. ఆ సమయంలోనే మా ఎమ్మెల్యే గారి అమ్మాయి గారికి దగ్గరై వివాహం చేసుకోవలసి వచ్చింది. 

నేను యెంత ఎదిగినా నాలో ఒక బాధ తొలిచేస్తూ ఉండేది. నా జీవితానికి పునాదులు వేసిన నిన్ను కలవాలని నా కృతజ్ఞతలను చెప్పుకోవాలిని, రుణాన్ని తీర్చుకోవాలని. ....  కాసేపు ఆగాడు అతను.

ఇంత  పరిస్థితికి కారణం నేను వూహించగలను. పద మీ యింటికి. ముందు వాళ్ళు కంగారు పడకుండా ఉండాలి. ఈ రోజు నుండి నీ పాత జీవితాన్ని మర్చిపో నా తో ప్రతీ సంతోషాన్నీ పంచుకో. అంటూ మరోసారి కౌగలించు కున్నాడు. 

అనంత నమ్మలేక పోయాడు. అతని మైండ్ బ్లాక్ అయింది. అచేతనంగా ఉండిపోయాడు. 

కిషన్ రెడ్డి గారు అనంత్ భుజం తట్టారు. ఆలోచించకండి! దేవుడు ఎక్కడో లేడు మన మనుషులలోనే ఉన్నాడు. అప్పుడు మీలో వుండి చిన్నారెడ్డికి సహాయం చేసాడు. ఇప్పుడు చిన్నారెడ్డిలో ఉండి మీకు సహాయం చేయబోతున్నాడు. వెళ్ళండి! ఇదంతా చూస్తుంటే మనం ఇంకా మనుషుల మధ్య ఉంటూ దేవుళ్లను చూస్తున్నట్లు ఉంది. అన్నాడు ఆనందంతో. 

అనంతలో కన్నీళ్లు గిర్రున తిరిగాయి.  మనసులోనే అనుక్కున్నాడు "అవును ఆ దేవుడు ఈ రూపంలో వచ్చాడు" అని. 

రచన: రామ మోహన్ ఆకుండి 

Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!