స్నేహ బంధము యెంత మధురము!


స్నేహం!! ఈ పదానికి యుగ యుగాలుగా ఎన్నో నిర్వచనాలు! మరెన్నో చారిత్రిక కథలు!

తెలుగు భాష వరకూ చూస్తే, సన్నిహితుడు  అంటే మనకు దగ్గరగా వుండి  మన హితం కోరుకునే వాడే స్నేహితుడు. 

రామాయణ మహాభారతాలలోనూ స్నేహం యొక్క విలువలను ప్రస్తావించారు. దీనిని సంస్కృతం లో మైత్రి అని అంటారు. 

ఒకసారి మైత్రి బంధం ఏర్పరుచుమున్నాక దానికి కట్టుబడి ఉండాలని అలా కట్టుబడి ఉండే వాడే మిత్రుడని అంటారు. 

రామాయణంలో మైత్రి ప్రస్తావన రాముడికి సుగ్రీవుడికి మధ్య చెప్పబడింది. అయితే ఈ మైత్రి ఒక అగ్రిమెంట్ లా చెప్పబడింది. 

సహజంగా ఇటువంటి మైత్రీ ఒప్పందాలు రాజ్యాల మధ్య, నాయకుల మధ్య జరుగుతాయి. ఒక ప్రయోజనానికి కట్టుబడి ఆ ప్రయోజనం పూర్తి అయ్యేవరకూ ఈ మిత్రత్వం కొనసాగుతుంది. మిత్రత్వం ఉన్నంత వరకు ఒకరికి ఒకరు రక్షణగా ఉంటూ ఒకరి కష్టానికి ఒకరు సహాయపడుతూ ఉండాలని నియమం ఉంది. అందుకే సుగ్రీవుడి సమస్యను రాముడు పరిష్కరించి వాలిని చంపవలసి వచ్చింది.  అదేవిధంగా సుగ్రీవుడు తన వానర సేనను రాముడికి అందించి, సీతను వెతకడం లో నలుదిక్కులా వెతికించీ రామ రావణ యుద్ధంలో సహాయపడ్డాడు. 

మహాభారతం లో కర్ణుడు దుర్యోధనుడి మిత్రత్వానికి కట్టుబడి, దుర్యోధనుడి అధర్మాలను సహితం ఎదురుచెప్పక, అతని క్షేమం కోరి జీవితకాలం అతనికి బాసటగా నిలిచాడు. మిత్రత్వానికే ఒక ఆదర్శంగా నిలిచాడు. 

అన్ని పరిచయాలు స్నేహాలు కావు. అన్ని బంధాలూ స్నేహ బంధాలు కావు. కొన్ని బంధాలు తమ వ్యాపార వ్యవహారాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. టెర్మ్సు బాగున్నంత వరకే అవి నిలుస్తాయి. అనుమానాలు, మోసాలు, కుట్రలు కూడా వాటిమధ్య పనిచేస్తాయి. 

అవసారాలకు వాడుకుని వదిలేసే తత్వం స్నేహం అనిపించుకోదు. అనేకమంది స్నేహం ముసుగు లో మోసం చేస్తూ ఉంటారు. వీరిని కనిపెట్టడం కష్టం అవుతుంది. మోసపోయాక గానీ వాళ్ళ ముసుగులు బయట పడవు. 

నిజమైన స్నేహితులు మనస్పర్థల వలన విడిపోయినా వారి మనసులలో స్నేహం నిశ్చలంగా ఉంటుంది. 

స్నేహం ఇద్దరు చెడ్డ వారి మధ్య ఉండవచ్చు, ఇద్దరు మంచి వారి మధ్య ఉండవచ్చు  లేదా ఒక చెడ్డ వ్యక్తికీ ఒక మంచి వ్యక్తికీ మధ్య కూడా ఉండచ్చు. 

స్నేహం చెడును మంచిగా మార్చవచ్చు, లేదా మంచిని చెడుగా మార్చవచ్చు. అందుకే చడ్డవాళ్లతో స్నేహం చేస్తే చెడిపోతావురా అని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. 

చెడ్డవారితో స్నేహం నేరాలకు ప్రభావితుల్ని చేస్తుంది. నేరస్తులతో స్నేహం ధర్మాత్ముడ్ని కూడా కటకటాల పాలు చేస్తుంది. 

మళ్ళీ ధుర్యోధనుడు కర్ణుడు స్నేహం విషయానికి వద్దాం. కర్ణుడు దానగుణం కలిగినవాడు, ఇచ్చిన మాటకు కట్టుబడే వాడు. కానీ కేవలం దుష్టుల స్నేహానికి కట్టుబడి ఉండటం వలన, ధర్మ వ్యతిరేకిగా చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. చివరికి యుధ్ధంలో న్యాయానికీ అన్యాయానికీ, ధర్మానికీ అధర్మానికీ జారిన సంగ్రామంలో అధర్మపక్షాన నిలబడి సర్వం పోగొట్టుకున్నాడు.

ఇద్దరు మంచి మేథావుల మధ్య స్నేహం సమాజానికి మేలు చేస్తుంది. ఇద్దరు దుర్మార్గుల మధ్య స్నేహం వినాశనం కలిగిస్తుంది. 

స్నేహం పరస్పర భావాల కలయిక వలన పుట్టవచ్చు. పరస్పర శత్రుత్వం నుండి కూడా పుట్టవచ్చు.  దూర ప్రాంతాలలో ఒకరికొకరు భౌతికంగా గతంలో ఎప్పుడూ ఎదురుపడని  వారి మధ్య కూడా ఏర్పడవచ్చు. 

ఎలా ఏర్పడినా స్నేహం యొక్క లక్ష్యం ఒక్కటే....  పరస్పర సహకారం! పరస్పర హితం కోరుకోవడం!!

స్వార్ధ ప్రయోజనాల కోసం ఏర్పడిన స్నేహం ఏ బలహీన క్షణంలోనైనా తెగిపోవచ్చు. 

అదేవిధంగా అపార్థాలు, అభిప్రాయబేధాలు మనుషులలో కలగడం సర్వసాధారణం. వాటిని స్నేహం బంధం తెగే వరకూ పెరగనీయ కూడదు. మనసు విప్పి మాట్లాడుకోవడం, సంయమనం పాటించడం, ఆవేశాలకు పోకుండా మనను మనం నియంత్రించుకోవడం ద్వారా స్నేహాన్ని కాపాడుకోవాలి.

స్నేహ బంధము యెంత మధురము! కరిగిపోదు, చెరిగిపోదు జీవితాంతము!  అని వాడుకోవడానికి బాగుంటుంది. కానీ నిలుపుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ ఆధునిక మెటీరియల్ ప్రపంచంలో అబద్దాలకు, అపార్థాలకూ వేగం పెరిగింది. స్వేచ్ఛ, స్వతంత్రం అనే భావాలు వెర్రి పోకడలకు పోయి మనుషుల మధ్య వ్యత్యాసాలను మరింత పెంచుతున్నాయి. పాలు నీళ్ళవుతున్నాయి, అమృతం విషమవుతోంది. 

కనుక సన్నిహితులతో సత్సంబంధాలను మెరుగు పరుచుకునే మానసిక స్థితి ఉండాలి. అర్థం చేసుకునే ఓపిక ఉండాలి. తొందరపడి బంధాలను త్రెంచుకునే దిశగా చర్యలు ఉండకూడదు. మాటలు అదుపులో ఉండాలి. 

మంచి మిత్రుల మధ్య స్నేహాన్ని చెడగొట్టే వ్యక్తులు నేటి సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలు. కనుక చాలా వివేకంతో స్నేహం బంధాలను నిలుపుకోవాలి.

స్నేహితుడు చెడ్డవాడైతే అతనిని మార్చే ప్రయత్నం చేయాలి. మారకుంటే విడిచిపెట్టాలి. కానీ అతని చెడు సాంగత్యంలో మనల్ని మనం చెడగొట్టుకోకూడదు.

నీ ప్రవృత్తికి తగిన వాడితో నీ ప్రయాణం కొనసాగించడమే నీకు మేలు అనే జీవన సత్యాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ పోస్టు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్సు లో తెలపండి. 

Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!