స్నేహ బంధము యెంత మధురము!
స్నేహం!! ఈ పదానికి యుగ యుగాలుగా ఎన్నో నిర్వచనాలు! మరెన్నో చారిత్రిక కథలు! తెలుగు భాష వరకూ చూస్తే, సన్నిహితుడు అంటే మనకు దగ్గరగా వుండి మన హితం కోరుకునే వాడే స్నేహితుడు. రామాయణ మహాభారతాలలోనూ స్నేహం యొక్క విలువలను ప్రస్తావించారు. దీనిని సంస్కృతం లో మైత్రి అని అంటారు. ఒకసారి మైత్రి బంధం ఏర్పరుచుమున్నాక దానికి కట్టుబడి ఉండాలని అలా కట్టుబడి ఉండే వాడే మిత్రుడని అంటారు. రామాయణంలో మైత్రి ప్రస్తావన రాముడికి సుగ్రీవుడికి మధ్య చెప్పబడింది. అయితే ఈ మైత్రి ఒక అగ్రిమెంట్ లా చెప్పబడింది. సహజంగా ఇటువంటి మైత్రీ ఒప్పందాలు రాజ్యాల మధ్య, నాయకుల మధ్య జరుగుతాయి. ఒక ప్రయోజనానికి కట్టుబడి ఆ ప్రయోజనం పూర్తి అయ్యేవరకూ ఈ మిత్రత్వం కొనసాగుతుంది. మిత్రత్వం ఉన్నంత వరకు ఒకరికి ఒకరు రక్షణగా ఉంటూ ఒకరి కష్టానికి ఒకరు సహాయపడుతూ ఉండాలని నియమం ఉంది. అందుకే సుగ్రీవుడి సమస్యను రాముడు పరిష్కరించి వాలిని చంపవలసి వచ్చింది. అదేవిధంగా సుగ్రీవుడు తన వానర సేనను రాముడికి అందించి, సీతను వెతకడం లో నలుదిక్కులా వెతికించీ రామ రావణ యుద్ధంలో సహాయపడ్డాడు. మహాభారతం లో కర్ణుడు దుర్యోధనుడి మిత్రత్...